గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే బదిలీలు, పదోన్నతులు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే బదిలీలు, పదోన్నతులు

June 14, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సబితా ఇంద్రారెడ్డి శుభవార్తను చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటినుంచో పదోన్నతుల కోసం బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ నెల చివరికల్లా ఆ పక్రియను మొదలుపెడుతామని ఆమె హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు.

అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ..”ఈ నెలాఖరులోగా ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుంది. ఈ పదోన్నతులు, బదిలీల విషయంలో సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై వినతిపత్రం అందించాం. మోడల్‌ స్కూల్‌ టీచర్ల బదిలీలు కూడా చేపడతామని సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించేలా డీఈవోలకు ఆదేశాలు జారీ చేస్తాం అని అన్నారు. పరస్పర బదిలీలకు సంబంధించిన ఒప్పందపత్రం సమర్పించిన వారికి వెంటనే ఉత్తర్వులివ్వాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కోరగా, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. జీఏడీ ఆమోదం లభించిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో అవసరమైన ఉత్తర్వులు అందనున్నాయి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ బదిలీల షెడ్యూల్డ్‌ ఈ వారంలో వెలువడుతుంది” అని ఆయన అన్నారు.

మరోపక్క ఉద్యోగంలో చేరినా రోజు నుంచి కొన్ని సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తూ, పదోన్నతి కోసం, బదిలీల కోసం ఉపాధ్యాయులు గతంలో ధర్నాలు, నిరసనలు చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో అధికారులతో చర్చలు జరిపి, ఇటీవలే బదిలీలను చేపట్టింది. ఈ క్రమంలో మరోసారి పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్వంలో బదిలీల కోసం, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారికి పక్రియను మొదలుపెట్టాలని వినతిపత్రం అందజేయడంతో సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఆఖరికల్లా ఆ పక్రియను మొదలుపెడతామని హామీ ఇచ్చారు.