తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల నిరుద్యోగులకు మరో శుభవార్తను చెప్పింది. సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 (క్లర్కు)ల పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్స్/ ఐటీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌లో డిగ్రీ/ డిప్లొమా/6 నెలల సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు అర్హులని అధికారులు తెలిపారు. ఇక వయసు విషయానికొస్తే.. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ..” సింగరేణిలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులకు ప్రకటన వెలువడింది. ఇవి క్లర్కు ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ అంటే ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే వర్తిసాయి. మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడ్ కోటా కింద ఓపెన్ టు ఆల్ ( అంటే తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థుల)కు వర్తిసాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తాం. ఆన్లైన్లో ఈ నెల 20 నుంచి జూలై 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అధికారికి వెబ్సైట్ www.scclmines.comను సంప్రదించండి” అని ఆయన అన్నారు.