గుడ్‌న్యూస్.. పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగింపు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగింపు

March 31, 2022

ADHAR

కేంద్రం ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసే విషయంలో ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇటీవలే ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మార్చి 31లోపు గనక లింక్ చేయకపోతే వినియోగదారుడు అనేక విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే, బుధవారం ఆ తేదీని పొడిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31 నుంచి 2023 మార్చి 31 వరకు మీ ప్రస్తుత పాన్ కార్డు పని చేస్తుందని తెలిపింది. అంటే పాన్ ఆధార్ లింక్ గడువును మరో ఏడాది పాటు పొడిగించారని తెలుస్తుంది.

అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని కోరింది. ఏప్రిల్ 1 నుంచి మీరు మాత్రం పెనాల్టీ ఎదుర్కోవలసి వస్తుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2022 మార్చి 29న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే.. ”ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూడు నెలలలోపు పాన్ ఆధార్ అనుసంధానికి రూ.500 జరిమానా పడుతుంది. మూడు నెలల దాటితే అప్పుడు రూ.1000 చెల్లించాలి. అయితే 2023 మార్చి చివరి వరకు పాన్ కార్డు మాత్రం చెల్లుబాటు అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోపు లింక్ చేసుకుంటే రూ.500 కట్టాలి. అదే జూలై 1 తర్వాత అనుసంధానం చేసుకుంటే రూ.1000 చెల్లించాలి. మీరు 2023 మార్చి 31లోపు కూడా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే అప్పుడు మీ పాన్ కార్డు చెల్లదు. అప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కాదు. మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయలేరు” అని నిపుణులు పేర్కొన్నారు.

మరోపక్క ‘ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే భారీ జరిమానాలు పడతాయి. ముందుగా పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా చేస్తారు. అటుపైన ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 272బీ ప్రకారం ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు కలిగిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. కాగా పాన్ ఆధార్ లింక్ చేసుకునే వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. రెండింటిలోనూ వివరాలు దాదాపు ఒకేలా ఉండేలా చూసుకోవాలి’ అని కేంద్రం తెలిపింది.