ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఏప్రిల్ 8వ తేదీ నుంచి విధించిన పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..”రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉంది. దీంతో, పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నాం. పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్‌ను కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజి, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరాల కోసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని, ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోవడంతో, విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదని, ఈ క్రమంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.