Goodnews..sitagliptin tablets price reduction: Center
mictv telugu

గుడ్‌న్యూస్..సితాగ్లిప్టిన్ ట్యాబ్లెట్ల ధర తగ్గింపు: కేంద్రం

September 17, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మధుమేహ వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. మధుమేహ వ్యాధికి ప్రధానంగా వినియోగించే సితాగ్లిప్టిన్ ఔషధాల ధరలను తగ్గిస్తూ, శుక్రవారం కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

విడుదల చేసిన ప్రకటనలో..”మధుమేహ వ్యాధికి సంబంధించిన సితాగ్లిప్టిన్ ఔషధాన్ని ప్రధాన మంత్రి జన ఔషధి మందుల షాపుల ద్వారా తక్కువ ధరకే కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది. సితాగ్లిప్టిన్ 50 ఎంజీ, 10 ట్యాబ్లెట్లను ఇకపై కేవలం రూ. 60 ధరకే విక్రయించనుంది. సితాగ్లిప్టిన్ ఫాస్పేట్ 100 ఎంజీ ట్యాబ్లెట్ల ధర రూ.100కు సరఫరా చేయనుంది. సితాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమ ఔషధాన్ని కూడా రూ.70 ధరకు (10 ట్యాబ్లెట్లు) విక్రయించనుంది” అని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ట్యాబ్లెట్లను రూ.182 నుంచి 258 ధరల శ్రేణిలో విక్రయిస్తున్నారు. దీంతో నిరుపేద మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ట్యాబెట్ల ధరలను తగ్గించాలని ఆయా కంపెనీలతో చర్చలు జరిపింది. తాజాగా ట్యాబెట్ల ధరలను తగ్గిస్తూ, నిర్ణయం తీసుకుంది.

భారతీయ జన ఔషధి పరియోజన సీఈఓ రవి దధీచ్ మాట్లాడుతూ..”దేశవ్యాప్తంగా 8,700 ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల ద్వారా నాణ్యమైన జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నాం. ప్రధాన మంత్రి 160 రకాల మందులు, 250 సర్జికల్ వస్తువులు ఈ కేంద్రాల్లో లభిస్తాయి” అని ఆయన అన్నారు.