Goodnews: Visas without interviews
mictv telugu

గుడ్‌న్యూస్: ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు

September 4, 2022

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలను మంజూరు చేస్తున్నామని ప్రకటించింది. తాజాగా బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్‌ప్రారంభమైన సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

విడుదల చేసిన ఆ ప్రకటనలో..ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించినట్లు తెలిపింది. అయితే, ఈ నిబంధన డిసెంబర్‌ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని సూచించింది.

”ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదు. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్‌మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించాం” అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.