Goods Train Crashes Into Passenger Waiting Hall In Odisha’s Jajpur, 3 Dead
mictv telugu

ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ముగ్గురు దుర్మరణం..

November 21, 2022

ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లా కొరేయ్ రైల్వే స్టేషన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చింది. 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గూడ్స్‌ బోగీల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం. భద్రక్ నుంచి కటక్ వెళ్తున్న ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పాసింజర్ వెయిటింగ్ హాల్లోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. స్టేషన్ పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

“ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఒక చిన్నారితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బోగీల కింద ప్రజలు చిక్కుకొని ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి మేము ఆందోళన చెందుతున్నాం. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది’’ అని ఆయన చెప్పారు. ఇక, గూడ్స్ రైలులోని మొత్తం 54 వ్యాగన్‌లలో ఎనిమిది స్టేషన్‌లోకి దూసుకెళ్లినట్టుగా రైల్వే అధికారులు చెప్పారు. సాధారణంగా గూడ్స్ రైలు స్టేషన్ మీదుగా వెళ్లే సమయంలో వేగం తగ్గుతుందని.. అయితే దాని వేగం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని చెప్పారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.