36 శాతం వడ్డీ.. లోన్ యాప్స్‌పై గూగుల్ వేటు - MicTv.in - Telugu News
mictv telugu

36 శాతం వడ్డీ.. లోన్ యాప్స్‌పై గూగుల్ వేటు

October 14, 2019

అప్పు తీసుకోవడం ఎంత కష్టమైన పనో తెలిసిందే. అప్పిచ్చేవారికి మనం తెలిసిన మొహమై వుండాలి. అలాకాదని బ్యాంకులకు వెళ్తే ష్యూరిటీ కింద ఏదో ఒక ఆస్తి చూపిస్తే గానీ లోన్ ఇవ్వరు. ఇలా అప్పు తీసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు పెడుతుంటారు. ఈ క్రమంలో టెక్నాలజీ మహిమో ఏంటో గానీ అప్పులు పుట్టడం కూడా చాలా సులువు అయిపోయింది. స్మార్ట్ అప్పులు ఇస్తామని వివిధ రకాల యాప్స్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖాముఖి పరిచయం లేకుండానే వారు అడిగిన డాక్యుమెంట్లు ఫోన్‌లో సమర్పిస్తే చాలు లోన్ అకౌంట్‌లో జమ అవుతుంది. దీంతో లోన్లు పొందడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఈ క్రమంలో మేమంటే మేము అప్పులు ఇస్తామని వివిధ రకాలైన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో పోటీలు పడుతున్నాయి. 

Play Store.

అయితే దీనిపై గూగుల్ నిఘా పెట్టింది. వినియోగదారుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న యాప్స్ పై వేటు వేసింది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వచ్చిన ఎక్స్ పాండెడ్ ఫైనాన్షియల్ పాలసీ నిబంధనల మేరకు పలు ప్రిడేటరీ లోన్ యాప్స్ పై నిషేధం విధించామని, వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించామని గూగుల్ వెల్లడించింది. సంవత్సరానికి 36 శాతం కన్నా వడ్డీని అధికంగా వసూలు చేసే లోన్ యాప్స్ వినియోగదారులకు నష్టం చేకూర్చేవేనని గూగుల్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వినియోగదారుల భద్రత రీత్యా వీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా, గూగుల్ తీసుకున్న నిర్ణయం, చట్టబద్ధంగా వ్యాపారం నడుపుకుంటూ, కస్టమర్ల అవసరాలను తీర్చే రుణ దాతలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆన్‌ లైన్‌ లెండర్స్‌ అలయన్స్‌ సీఈఓ మేరీ జాక్సన్‌ అభిప్రాయపడ్డారు.