Google CEO's Epic Response To Pakistan Fan's Tweet Goes Viral
mictv telugu

పాక్ నెటిజన్‌కు గూగుల్ సీఈవో దిమ్మతిరిగే కౌంటర్

October 24, 2022

దేశానికి ఒక రోజు ముందే పండుగ తెచ్చారు మన టీమిండియా క్రికెటర్లు. టీ20 ప్రపంచకప్‌ లో దాయాది పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించారు. ఆ విజయాన్ని యావత్ భారతావనితో పాటుగా ప్రవాస భారతీయులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గూగుల్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ కూడా మ్యాచ్‌ సంబరంతోనే దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆ విషయాన్ని చెబుతూ ఆయన ఓ ట్వీట్ చేయగా.. ఓ పాక్‌ నెటిజన్ విమర్శించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ విమర్శకుడికి సుందర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

మ్యాచ్ గురించి చెబుతూ సుందర్‌ పిచాయ్‌ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. నేను కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లను ఈ రోజు మళ్లీ చూసి దీపావళి వేడుకలు చేసుకున్నా. అద్భుతమైన గేమ్‌.. టీమ్‌ఇండియా అత్యద్భుత ప్రదర్శన’’ అని పిచాయ్‌ రాసుకొచ్చారు.

కాగా.. ఈ ట్వీట్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ షాజీద్ అనేఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది’’ అంటూ రిట్వీట్ చేశాడు. ఈ ట్రోల్‌కు సుందర్‌ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘అది కూడా చూశా.. భువీ, అర్ష్‌దీప్‌ నుంచి అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్‌’’ అంటూ బదులిచ్చారు. ఆ తర్వాత సదరు ట్విటర్‌ యూజర్‌ తాను టీమిండియా ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతున్నానని మరో ట్వీట్‌ చేసినప్పటికీ నెటిజన్లు అతడికి చురకలంటించారు. ‘‘అంత గొప్ప వ్యక్తి నీ ట్వీట్‌కు స్పందించడమే గొప్ప విషయం’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.