ఆర్దిక మాంద్యం వస్తుందన్న భయంతో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు పాటిస్తున్నాయి. ఇందుకోసం దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రఖ్యాత గూగుల్ తన సంస్థలో పని చేస్తున్న 12 వేల మందిని ఇంటికి పంపించేసింది. ఇందులో భారత్‌లో ఉన్న 450 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆఫీసుల్లో ఉద్యోగులు డెస్కులు షేర్ చేసుకోవాలని ఆదేశించింది.
హైబ్రిడ్ మోడ్ అమల్లో ఉన్నా ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనని ప్రకటించింది. ఇలా రోజుకో నిర్ణయంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ వచ్చిన గూగుల్ ఇప్పుడు మరో సంచలనానికి తెర తీసింది. వివిధ పనుల్లో నియమించుకున్న రోబోలను పీకేసింది యాజమాన్యం. ఆఫీసుల్లో టేబుళ్లు తుడిచేందుకు, డోర్లు తెరవడానికి, చెత్త ఎత్తడానికి ట్రైనింగ్ ఇచ్చిన రోబోలను షట్‌డౌైన్ చేయనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
అలాగే అల్ఫాబెట్ సీక్రెటివ్ ఏక్స్ మూన్‌షాట్ ల్యాబ్‌ను ఏడాదికే మూసేసింది. ఇందులో 200 మంది ఉద్యోగులు రోబోటిక్స్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఇది కూడా ఖర్చు తగ్గించుకోవడంలో భాగమేనని ఎవ్రీడే రోబోట్స్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ డేనిస్ గాంబావో వెల్లడించారు. అయితే దీనిపై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. రోబోలు ఏమైనా జీతం అడిగాయా? లేక జీతం పెంచమని డిమాండ్ చేశాయా? అంటూ గూగుల్‌ని ట్రోల్ చేస్తున్నారు.