డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ సామాన్యులకు అర్ధం కాదనే విషయం మనకు అనుభవమే. అది కేవలం మెడికల్ షాపు సిబ్బందికి మాత్రమే అర్ధమవుతుంది లేదా వారికి మాత్రమే అర్ధమయ్యేలా డాక్టర్లు రాస్తారనే నమ్మకం ఉంది. సామన్య జనాలకు అర్ధమయ్యేలా రాయాలని డాక్టర్లను కేంద్రం ఆదేశించినా డాక్టర్లు మాత్రం తమకు అలవాటైన రీతిలోనే ఇప్పటివరకు రాస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో గూగుల్ ఓ పరిష్కారాన్ని కనుగొంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాస్త చదువుకున్న ఎవరైనా డాక్టర్ల రాతను గూగుల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
స్పష్టంగా చెప్పాలంటే డాక్టర్ల చేతిరాతను డీకోడ్ చేయవచ్చన్నమాట. సోమవారం ఢిల్లీలో జరిగిన గూగుల్ ఇన్ ఇండియా కార్యక్రమంలో టెక్ దిగ్గజం ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టింది. దీనికి భాగస్వామిగా అపోలో హాస్పిటల్ వ్యవహరిస్తోంది. గూగుల్ ఇండియాలో రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ గుప్తా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గతంలో చాలా సంస్థలు దీన్ని పరిష్కరించాలని చూసినా ఆశించి స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు గూగుల్ దాన్ని సుసాధ్యం చేసింది. ప్రిస్క్రిప్షన్ ని ఫోటో తీసి లేదా లైబ్రరీ ఫోటోల నుంచి తీసుకొని అప్ లోడ్ చేసిన తర్వాత యాప్ నోట్ లో పేర్కొన్న మందులను గుర్తిస్తుంది. దీన్ని ప్రాక్టికల్ గా ఈ కార్యక్రమంలో ప్రదర్శించి చూపారు.