మాంద్యం భయాలు నెలకొన్న పరిస్థితుల్లో పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలతో సహా ఇండియాలో కూడా ఈ ట్రెండ్ ఇప్పటికే కొనసాతుండగా, పలు దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేఆఫ్ బాట పట్టాయి. ఈ క్రమంలో ఇదివరకే ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్ సంస్థ తాజాగా భారత్‌లో 450 ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుందని హిందూ బిజినెస్ లైన్ తన కథనంలో ప్రస్తావించింది. అయితే గతంలో ప్రకటించిన 12 వేల మందిలో భాగంగా 450 మందిని తొలగించారా? లేక ఇది అదనమా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. గురువారం సాయంత్రం తొలగించిన ఉద్యోగుల ఈమెయిల్స్‌కి సమాచారం అందించారని తెలుస్తోంది. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, భాగస్వామ్య వ్యాపారాల్లో పని చేసే ఉద్యోగులపై వేటు వేశారని సమాచారం. ఆ సంస్థకు బెంగళూరు, హైదరాబాద్, గుర్‌గ్రామ్‌లలో ఆఫీసులున్నాయి. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా అధిక సంఖ్యలో ఉద్యోగులను తీసుకున్నామని, ఇప్పుడు బలహీన స్థూల ఆర్ధిక పరిస్థితితో కొందరిని తొలగిస్తున్నట్టు గత నెల 12 వేల మందిని తొలగించినప్పుడు గూగుల్ సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు లింక్డ్‌ఇన్ వేదికగా పోస్టులు పెడుతుండడాన్ని బట్టి ఇది నిజమేనని అర్ధం అవుతోంది. కంపెనీలో స్ట్రాటజిక్ కీ అకౌంట్ మేనేజరుగా పని చేస్తున్న ఓ ఉద్యోగి తాను గూగుల్ డిజిటల్ మార్కెటింగ్‌లో శక్తివంచన లేకుండా పని చేశానని, అయినా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.