డిజిటల్ లావాదేవీల యాప్ గూగుల్ పేను రిజర్వ్ బ్యాంక్ నిషేధించిందని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొట్టిపారేసింది. భారత్‌లో గూగుల్ పే యాప్‌ను బ్యాన్ చేయలేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది. ఈ క్రమంలో కొన్ని రోజులు పనిచేయని గూగుల్ పే, ఫోన్ పేలు మళ్లీ పనిచేశాయి. తాజాగా సాఫ్ట్వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన యాప్ స్టోర్ నుంచి గూగుల్ పే యాప్‌ను తొలగించారు. యాప్ స్టోర్‌లో ప్రస్తుతం గూగుల్ పే సెర్చింగ్‌లో కనిపించడంలేదు. పేటీఎం, ఫోన్ పే తదితర యాప్‌లు కనిపిస్తున్నాయి కానీ, గూగుల్ పే కనిపించడంలేదు.
ఈ విషయమై గూగుల్ స్పందిస్తూ.. ఇది కేవలం తాత్కాలికమేనని స్పష్టంచేసింది. గూగుల్ పే యాప్‌కు చెందిన కొత్త అప్డేట్ వల్ల ఈ సమస్య వచ్చిందని, ఆ కారణం చేతే యాప్‌ను తొలగించామని తెలిపింది. ఆ సమస్యను పరిష్కరించి మళ్లీ యాప్‌ను స్టోర్‌లో ఉంచుతామని పేర్కొంది. మరోపక్క గూగుల్ పే యాప్‌ను వాడుతున్న ఐఫోన్ యూజర్లకు పేమెంట్ ఫెయిల్యూర్ సమస్య వస్తుందని.. అందుకే వారు తాత్కాలికంగా పేమెంట్లను చెల్లించడం నిలిపివేయాలని గూగుల్ తెలిపింది. యాపిల్ యాప్ స్టోర్‌లో యాప్‌ను ఉంచాకే లావాదేవీలు చేసుకోవచ్చని, అప్పటి వరకు వేచి చూడాలని కోరింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ పే యాప్‌కు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాడుకోవచ్చని గూగుల్ వివరించింది.