జియో టెలికాం సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి మరో టెక్ దిగ్గజం ముందుకు వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా గూగుల్ కూడా జియోలో రూ.30,150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. కొన్ని వారాల్లో ఈ ఒప్పందం ఖరారు కానుందని బ్లూంబర్గ్ మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్లో రూ.75,000 కోట్ల పెట్టుబడులు పెడతామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. భారత్ డిజిటల్ వ్యవస్థలో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవడంపై గూగుల్ దృష్టి సారించింది. భారత్లోని పెద్ద కంపెనీలు, ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, డేటా కేంద్రాల వంటి మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెడతామని కూడా సుందర్ పిచాయ్ పేర్కొన్నాడు.