ఇంటర్నెట్ దిగ్గజం జీవితాల్లోనే కాకుండా వీధుల్లోకి కూడా వచ్చే చాలా ఏళ్లే అయింది. గూగుల్ మ్యాప్స్ నెటిజన్లను సులువుగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ కూడా బాగానే పనికొచ్చేది. భద్రతాకారణాల వల్ల దీన్ని మనదేశం ఆరేళ్ల కిందట నిషేధించింది. కంపెనీలు గట్టి హామీ ఇవ్వడంతో ఈ ఫీచర్‌కు మళ్లీ అనుమతినిచ్చింది. దీంతో ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు. దీనిసాయంతో ఒక ప్రాంతాన్ని మనం 360 డిగ్రీల్లో చూడొచ్చు. తొలుత ఈ సాదుపాయం హైదరాబాద్, ముంబై, అహ్మద్ నగర్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, నాసిక్, పూణే, వడదోరల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరికల్లా మరో 50 నగరాలకు ఈ సదుపాయాన్ని కల్పిస్తారు.
గూగుల్, టెక్ మహీంద్రా, జెన్సె సంస్థలు కలసికట్టుగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చాయి. 360 డిగ్రీల పనోరమిక్ ఇమేజెస్‌తో మొత్తం పది నగరాల్లో లక్షా 50 వేల కిలోమీటర్ల పరిధిలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసి మనకు కావాలిసిన స్ట్రీట్‌లో టార్గెటెడ్ షాప్స్, స్కూల్స్, టెంపుల్స్ వంటి వాటిని వేరువేరుగా చూడొచ్చు. గూగుల్ ఎర్త్ ద్వారా ఉష్ణోగ్రతలు కూడా తెలుసుకోవచ్చు. 2011లో విడుదలైన స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను దాదాపు పాశ్చాత్యదేశాలన్నీ వాడుతున్నాయి. అయితే దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయనే ఆందోళనలు ఉన్నాయి.