రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైకి గుడ్ బై.. గూగుల్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైకి గుడ్ బై.. గూగుల్ నిర్ణయం

February 17, 2020

Google

రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై పై గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై అందించేందుకు ఉద్దేశించిన ‘గూగుల్ స్టేషన్’ ప్రోగ్రాంను ఎత్తివేస్తున్నట్టు సోమవారం గూగుల్ వెల్లడించింది. 

ఈ విషయమై గూగుల్ ఉపాధ్యక్షుడు సీజర్ గుప్తా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ సేవలు చాలా చవకగా మారిపోయాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా, నైజీరియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోనూ ఉచిత వై-ఫై సేవలను ఎత్తివేయనున్నాం. ఐదేళ్ల క్రితం ‘గూగుల్ స్టేషన్లు’ ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి రావడం చాలా సులభతరంగా, చవకగా మారింది. మొబైల్ డేటా ప్లాన్లు చాలా తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ కనెక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‌లో మొబైల్ డేటా లభ్యమవుతోంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మొబైల్ డేటా ధర 95 శాతం తగ్గింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే గూగుల్ స్టేషన్ల ఎత్తివేత నిర్ణయానికి వచ్చాం’ అని వెల్లడించారు. 

2015లో భారతీయ రైల్వే, రైల్ టెల్ భాగస్వామ్యంతో గూగుల్ వేగవంతమై, ఉచిత పబ్లిక్ వై-ఫై సేవలను ఆరంభించింది. 2020 నాటికి 400కు పైగా రైల్వే స్టేషన్లలో అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 2018 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించినట్టు సీజర్ చెప్పారు.