గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. అలా అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు కట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్రాకింగ్ చేయడానికి కట్టారా అంటూ ధ్వజమెత్తారు.
బెదిరింపులకు భయపడేది లేదని.. ధర్మం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కావాలని గోషామహల్ ఎమ్మెల్యే తెలిపారు. ‘‘ఎమ్మెల్యేనైన నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎంఐఎంకు టెర్రిరిస్టుల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే.. పోలీసులు పట్టించుకోవడంలేదని రాజాసింగ్ ఆరోపించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని.. అది తనకు చాలని అన్నారు. తెలంగాణ యువత ఆశీర్వదిస్తే ధర్మం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. మళ్లీమళ్లీ బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని, ఇప్పటికైనా పోలీసులు స్పందించాలని కోరారు.