Gouri Khan : బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పారిశ్రామికవేత్త, పబ్లిక్ ఫిగర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్‌పై ముంబై కి చెందిన ఓ రెసిడెంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్షన్ 409 ఉల్లంఘన కింద గౌరీపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
లక్నోలో ఓ అపార్ట్‌మెంట్ల కంపెనీకి గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. గౌరీ ని చూసే తాను అపార్ట్ మెంట్లో ఫ్లాట్‌ను కొన్నానని జస్వంత్ షా అనే రెసిడెంట్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే కంపెనీ తన ఫ్లాట్ సకాలంలో అందించడంలో విఫలమైందని, తాను చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని షా పేర్కొన్నాడు. ఫ్లాట్ కోసం కంపెనీ తన వద్ద రూ. 86 లక్షలు వసూలు చేసిందని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డబ్బు చెల్లించినా ఫ్లాట్ ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఫ్లాట్ ఉందని ఫిర్యాదుదారుడు తెలిపాడు. తనకు ఇప్పటికీ ఫ్లాట్ ఇవ్వకపోగా కంపెనీ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చిందని, తన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని అతను పేర్కొన్నాడు. ముంబై పోలీసులకు అతను చేసిన ఫిర్యాదులో బిల్డర్లు, కంపెనీతో సహా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిపై ఫిర్యాదు చేశాడు. కంపెనీని ప్రమోట్ చేసి తమలో నమ్మకాన్ని పెంచిన బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ పై కూడా కేసు నమోదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై ఇప్పటి వరకు గౌరీ ఖాన్ తరపున ఎవరూ స్పందించలేదు. నిర్మాతగా చిత్ర పరిశ్రమలో కొనాసాగుతూనే, ఫ్యాషన్ రంంలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారు గౌరీ ఖాన్. అంతేకాదు దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఒకరు. ఆమె గౌరీ ఖాన్ డిజైన్స్ పేరుతో తన స్వంత బ్రాండ్‌ను నడుపుతోంది.