ఒకే ఒక్క నివేదిక.. తనకే తిరుగేలేదనుకున్న అపర కేబేరుడి వ్యాపార సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసింది. లెక్కలు బయటికి తీసి పేకమేడలను కూల్చేసింది. గౌతమ్ అదానీ గురించే ఇదంతా. అమెరికా పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల విలువ దారుణంగా పడిపోతోంది. అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ భారీగా పతనమవుతుండడంతో గడిచిన వారంలోనే అదానీకి లక్షల కోట్ల నష్టం వచ్చింది.ప్రపంచ కుబేరుల జాబితాలో వారం క్రితం 4వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం టాప్ 15 కన్నా కిందకు పడిపోయాడు.
వారం రోజుల్లోనే అదానీ గ్రూప్ సంస్థలు 100 బిలియన్ డాలర్లు నష్టపోయాయి. గురువారం మార్కెట్ సెషన్లలోనూ నష్టాల్లోనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ దెబ్బకు రూ. 20 వేల కోట్లు సమీకరణే లక్ష్యంగా తీసుకొచ్చిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సైతం వెనక్కి తీసుకున్నారు.ఈ ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ వెనక్కి తీసుకున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక నిరాధారమైనదని అదానీ గ్రూప్ నెత్తినోరూ కొట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది.ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొంది. ఆందోళనలతో అమ్మకాలు చేపడుతుండటంతో భారీగా నష్టపోతున్నాయి. నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ ఎలా కుదేలైందో క్లుప్తంగా తెలుసుకుందాం..
• హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24 నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్ స్టాక్స్ అక్రమాలకు పాల్పడిందని, అకౌంట్లు తప్పుగా చూపించి లాభాలు మూటగట్టుకుంటోందని వివరించింది. తర్వాత అదానీ గ్రూప్ సంస్థల షేర్లలో భారీగా అమ్ముడుపోయాయి. గురువారం నాటికి బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం మార్కెట్ వాల్యూలో 100 బిలియన్ డాలర్లు కోల్పోయారు అదానీ.
• పతనమైన అదానీ గ్రూప్, దాని అనుబంధ సెక్యూరిటీలపై సమీక్షిస్తున్నట్లు ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సీఐ నివారం తెలిపింది. హిండెన్‌బర్గ్ రిపోర్టు తప్పుల తడక అంటూ అదానీ గ్రూప్ గత ఆదివారం 413 పేజీల స్పందన విడుదల చేసింది. ఇది తమై జరుగుతున్న దాడి కాదని, ఏకంగా భారత్ మీదనే అంటూ తెగ బాధను వెళ్ళగక్కింది. ఇంత చేసిన తర్వాత హిండెన్‌బర్గ్ మరో ప్రకటన చేసింది. దమ్ముంటే తాము వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని,…ఎందుకు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని అడిగింది. జాతీయ వాదం ముసుగులో చేసిన మోసాలను దాచలేరని మొహం బద్దలు గొట్టింది.
• అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. సంపద ఢామ్మని కింద పడిపోయారు. అతని సంపద వారంలోనే భారీగా పడిపోయింది. ఈ దెబ్బకు ఆసియాతో పాటు దేశంలోనే సంపన్నుడి స్థానాన్ని కోల్పోయారు. ముఖేశ్ అంబానీ మళ్ళీ పైకొచ్చేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అయితే అదానీ 15కు పడిపోయారు.
• క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజీ తన ప్రైవేటు బ్యాంకింగ్ కస్టమర్లకు మార్జిన్ లోన్ల కోసం గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల బాండ్లను ఆమోదించడాన్ని నిలిపివేసింది. మార్జిన్ లోన్ల కోసం గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థల నుంచి సెక్యూరిటీలను ఆమెదించడాన్ని సిటీ గ్రూప్ సంస్థ సైతం నిలిపివేసినట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా తెలిపింది.
• అదానీ ఎంటర్ ప్రైజెస్ నుంచి రూ.20వేల కోట్లు సమీకరణ కోసం ఎఫ్‌పీఓ తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ దానిని రద్దు చేశారు. భారీగా నష్టాలు వచ్చే ప్రమాదం నుంచి ఇన్వెస్టర్లను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
• గౌతమ్ అదానీ గ్రూప్ జారీ చేసిన బాండ్లు అమెరికా ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. బ్లూమ్‌బర్గ్ అదానీ పతనాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోంది. గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థలకు ఇచ్చిన రుణాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నివేదిక కోరినట్లు రాయిటర్స్ నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి :
అదానీ గ్రూప్ హఠాత్తుగా FPOని ఎందుకు రద్దు చేసింది..?
పార్లమెంట్‌లో ‘అదానీ గ్రూప్’ రచ్చ.. ఉభయసభలు వాయిదా