ఒకప్పుడు తెలుగు యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన దక్షిణాది నటి గౌతమికి కోపం నషాళానికి అంటింది. తను మళ్లీ కమల్ హాసన్ తో కలసి జీవించనున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె ఫైర్ అయ్యారు. ‘‘మూర్ఖులు పిచ్చికూతలు కూస్తారు.. కుక్కలు మొరుతాయి. జనం కాస్త మంచివిషయాలపై దృషి సారిస్తే మంచిది’’ అని ట్వీట్ చేశారు. కమల్ తో మళ్లీ జీవించే అవకాశం లేదని, తామిద్దరం విడిపోయామని స్పష్టం చేశారు.
13 ఏళ్ల సహజీవనం అనంతరం గౌతమి కమల్ తో విడిపోవడం తెలిసిందే. అభిప్రాయ భేదాల వల్ల విడిపోతున్నామని గౌతమి ప్రకటించారు. అయితే వీరిద్దరూ మళ్లీ కలసి జీవించనున్నారని, ఇప్పటికీ బాగానే మాట్లాడుకుంటున్నారని ఓ తమిళ టీవీ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపైనే గౌతమి నిప్పులు చెరిగారు. కమల్‌తో మళ్లీ తన బంధాన్ని కొనసాగించడం లేదని, ఆయన జీవితం నుంచి పక్కకు వచ్చేశానని తెలిపారు.