కృష్ణుడు ఎత్తిన కొండరాళ్లతో బిజినెస్ - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణుడు ఎత్తిన కొండరాళ్లతో బిజినెస్

February 8, 2021

govardhanagiri hill rocks for sale in indiamart

వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. నీళ్లను, గాలినే అమ్మేస్తున్న పాడు కాలంలో కొండలూ గుట్టలూ ఒక లెక్కా? ఏదో ఒకటి అమ్మేసి కాసిని డబ్బులు జేబులో వేసుకోవడం నేటి వ్యాపార సూత్రం. దానికి సెంటిమెంట్లు అడ్డం కావు.విషయం ఏమంటే.. శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి పర్వతాన్ని కొందరు ప్రబుద్ధులు అమ్మేస్తున్నారు. మొత్తం కొండను కాకుండా కొండ నుంచి కొన్ని రాళ్లు సేకరించి ఆన్‌లైన్‌లో భారీ ధరకు అమ్ముతున్నారు. బెత్తెడు రాయిని ఆరువేల రూపాయాలకు అమ్ముతున్నారు.

ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఇండియామార్ట్‌లో ఈ వ్యాపారం సాగుతోంది. విషయం బయటికి పొక్కడంతో ఆ వెబ్ సైట్ సీఈవోతోపాటు మరో ఇద్దరిపై కేసు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఉన్న గోవర్ధనగిరిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. భాగవతం, మహాభారతం తదితర గ్రంథాల్లో గోవర్ధనగిరి కథ ఉంది. ఆ కథ ప్రకారం.. ఇంద్రుడు ఆగ్రహించి రేపల్లెపై ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురిపిస్తాడు. కృష్ణుడు ప్రజలను, గోవులను కాపాడటానికి గోవర్ధన గిరిని ఎత్తి దాని కింద ఆశ్రయం కల్పిస్తాడు. అందుకే దీన్ని పవిత్రంగా భావిస్తారు.

ఈ సెంటిమెంటును సొమ్ము చేసుకోడానికి ఇండియామార్ట్ పథకం వేసింది. గోవర్ధన్ గిరిని రాళ్లు తెచ్చి అమ్మకం ప్రారంభించింది. కేశవ్ ముఖియా అనే సామాజిక కార్యకర్త ఈ సంగతి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోవర్ధనగిరి గ్రామ ప్రజలు కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.