జహీరాబాద్ : ప్రభుత్వం చంపేసింది.. ప్రైవేటు బతికించింది - MicTv.in - Telugu News
mictv telugu

జహీరాబాద్ : ప్రభుత్వం చంపేసింది.. ప్రైవేటు బతికించింది

June 3, 2022

ఉపవాసంతో అపస్మారక స్థితిలో ఉన్న నూతన వధువును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడి డాక్టరు చనిపోయిందని ధృవీకరించాడు. నమ్మని తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే చావలేదు, బ్రతికే ఉంది అని వధువును బతికించారు. తమ కూతురు బతికినందుకు తల్లిదండ్రులు సంతోషపడినా.. ప్రైవేటు ఆసుపత్రికి చెల్లించిన లక్షల రూపాయలను చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బాధితులు చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాదుకు చెందిన అర్చన (20)కు ఇటీవల ఓ యువకుడితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కొత్తగా కాపురానికి వెళ్లిన యువతి అత్తారింట్లో ఉపవాస దీక్ష చేసింది. ఈ క్రమంలో మే 7న అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే ఆమె భర్త అర్చన తల్లిదండ్రులకు విషయం చేరవేసి, అర్చనను స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అర్చనను పరీక్షించిన ప్రభుత్వ వైద్యుడు సంతోష్ మార్గమధ్యంలోనే చనిపోయిందని తేల్చేశాడు. అంతేకాక, ఓ స్లిప్పుపై ‘బ్రాట్ డెడ్’ అని రాసిచ్చేసి రిజిస్టర్‌లో చనిపోయినట్టు సంతకం కూడా చేయించుకున్నాడు. వైద్యుడి మాటలు నమ్మని అర్చన పేరెంట్స్ ఆమెను సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వారు పరిశీలించి బతికే ఉందని నిర్ధారించారు. వైద్యం చేసి మే 22న డిశ్చార్జి చేశారు. వారం తర్వాత మే 28న మరోసారి పరీక్షించి పూర్తిగా కోలుకుందని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ వైద్యుడు సంతోష్.. రిజిస్టర్‌లో చనిపోయిందని రాసిన చోట మరో తెల్ల కాగితం అంటించి వేరే ఆసుపత్రికి రెఫర్ చేశామని రాసుకున్నాడు. అయితే ముందుగానే మొదటి పేపరుని ఫోటో తీసుకున్న బాధితులు దానిని మీడియాకు చూపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ డాక్టరు చేసిన నిర్వాకం వల్ల లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ని వివరణ కోరగా, మొదటి పరీక్షలో చనిపోయినట్టు వచ్చింది. దాంతో అలాగే రాసుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యుల ఆవేదన చూసి మరోసారి పరీక్షించగా బతికున్నట్టు తేలింది. దాంతో వేరే ఆసుపత్రికి రెఫర్ చేసినట్టు రిజిస్టరులో మార్చామని తెలిపారు. బాధితుల ఆరోపణలు సరికాదని ఖండించారు.