ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి.. స్థానిక గ్రామ పంచాయతీ మహిళా కార్యదర్శితో అసభ్యంగా ప్రవర్తించి చావుదెబ్బలు తిన్నాడు. అతడి వేధింపులు గురించి సదరు మహిళ తమ గ్రామస్తులకు చెప్పడంతో.. వారంతా అతని ఆఫీస్కు వెళ్లి చితకబాదారు. జిల్లాలోని ఇందుకూరుపేటకు చెందిన మహిళా కార్యదర్శిని ఎంపీడీవో పఠాన్ ఖాన్ చాలాకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ‘మా ఇంటికి రా… స్నానం చేయిస్తా! ఓ కిస్ ఇస్తావా.. ! పోనీ ఎక్కడికి రమ్మంటావు..!’ అంటూ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన ఆ మహిళ ఈ విషయాన్ని తన బంధువులు, గ్రామస్తులకి తెలిపింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వారు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. వేధింపులపై పఠాన్ ఖాన్ ను నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీడీవో తెలపడంతో, గ్రామస్తులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎంపీడీవో షర్ట్ పట్టుకుని… రారా బయటకు అంటూ లాగింది. అతని మీద చేయి చేసుకుంది. ఎంపీడీఓ కూడా తిరగబడి, చేయి చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులంతా ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఎంపీడీఓను కాపాడటానికి ప్రయత్నించిన సిబ్బందికీ దెబ్బలు తప్పలేదు.
ఇందుకూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కేసు నమోదు చేశారు. ఎంపీడీఓ వేధింపులును తట్టుకోలేక కార్యదర్శి ఆత్మహత్యకు ప్రయత్నించిందని, ఫోన్ లో అతడు పెట్టే మెసేజ్ లు, వాయిస్ రికార్డులు చూసి ఆ అమ్మాయి సంసారం కూలిపోయే ప్రమాదం వచ్చిందని కార్యదర్శి బంధువులు తెలిపారు. ఎంపీడీఓను సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ చక్రధర్ బాబు ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. వీరి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.