రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం: సోమేశ్ కుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం: సోమేశ్ కుమార్

June 25, 2022

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం డబీర్ పేటకు గ్రామానికి చెందిన దామెర రాకేష్ ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో కేసీఆర్ రాకేష్ మృతి పట్ల సంతాపం తెలిపి, అతని కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

ప్రకటించిన విధంగానే రాకేష్ సోదరుడు రామరాజుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తూ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం వరంగల్ కలెక్టర్ బీ గోపికి ఆదేశాలు జారీ చేశారు. రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయని, కేసీఆర్ ఆదేశాల మేరకు రామరాజును తగిన ఉద్యోగంలో నియమించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. కారుణ్య నియామకం కింద విద్యార్హతల అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన పోస్టులో నియమించాలని సోమేశ్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జూన్ 17వ తేదీన సికింద్రాబాద్ రైల్యే స్టేషన్‌లో ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ యువకులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో సికింద్రాబాద్ రైల్యే స్టేషన్‌లోని పలు రైళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. దాంతో ఆందోళన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నిరసనకారులపై పోలీసులు 20 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.