ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి.. ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థనూ అమ్మేయాలన్న తొందరేం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అవసరం లేని వాటినే వద్దనుకుంటున్నామని.. టెలికాం సహా నాలుగు వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీస వాటాను అలాగే కొనసాగిస్తున్నామని చెప్పారు. శనివారం రాత్రి ఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ 2023 సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి కేంద్రం పాల్పడుతోందనే ప్రతిపక్ష విమర్శలను ఆమె తోసిపుచ్చారు.
‘ప్రతి ఒక్కటీ అమ్మేయాలనే తొందర ప్రభుత్వానికి లేదు. అలాగని గుండు సూది దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిని తయారు చేసే వ్యాపారాలన్నింటినీ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పడం లేదు. సొంతంగా వాటంతట అవే కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఉన్న పెద్ద సంస్థలు యథాతథంగానే కొనసాగుతాయి. కానీ చిన్న పరిమాణంలో వ్యాపారాలను నిర్వహించలేని స్థాయిలో ఉన్న వాటిని.. వేరే సంస్థలో విలీనం చేసి వాటా పరిమాణాన్ని పెంచుతాం. తద్వారా వాటి అవసరాలను ఆ సంస్థలే తీర్చుకునేలా తయారుచేస్తాం. టెలికాం లాంటి వ్యూహత్మక ప్రయోజనాలు ఉన్న చోట్ల వ్యాపారాలను కొనసాగిస్తాం’ అని ఆమె తెలిపారు.
ప్రభుత్వ యాజమాన్య నియంత్రణను కొనసాగించనున్న నాలుగు వ్యూహాత్మక రంగాల్లో టెలికాంతో పాటు అణువిద్యుత్, స్పేస్, రక్షణ; రవాణా, టెలికమ్యూనికేషన్స్; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.51,000 కోట్లను సమీకరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.