Government of India mandated that all smartphones should have a single charger
mictv telugu

అన్ని స్మార్ట్‌‌ఫోన్లకు ఒకటే ఛార్జర్.. ఆదేశించిన కేంద్రం

November 17, 2022

దేశంలో మొబైల్ విప్లవం రావడంతో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విరివిగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో చార్జర్ పోర్టులు వాడడంతో కస్టమర్లు కూడా ఫోనుకు తగ్గట్టు చార్జర్లను వినియోగిస్తున్నారు. దీని వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు భారీగా పేరుకుపోతున్నాయి. అటు యూజర్లు కూడా ఛార్జింగ్ విషయంలో ఇబ్బందులు పడుతూ అన్ని ఫోన్లకు ఒకటే ఛార్జర్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనదగ్గరే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. మన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఛార్జర్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై దేశంలో అందుబాటులో ఉండే అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ డివైజ్‌లు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు కలిగి ఉండాలని ఆదేశించింది. అన్నింటికీ టైప్ – సి రకం యూఎస్బీ పోర్టు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పలు కేంద్రమంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ఆయా పరిశ్రమల ప్రతినిధులు కూడా అంగీకరించారు. అయితే ఎన్ని రోజుల్లో టైప్ – సి పోర్టు అందుబాటులో తీసుకురావాలనే అంశంపై కేంద్రం నిర్ణీత గడువు విధించలేదు. అంచనాల ప్రకారం యాపిల్ సహా అన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, స్మార్ట్ వాచీలకు టైప్ – సి ఛార్జర్లు ఉండనున్నాయి. కాగా, నిరక్షరాస్యులు, పేదలు ఎక్కువగా వినియోగించే ఫీచర్ ఫోన్లకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.