కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14న ఆవులను కౌగిలించుకోవాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత జంతు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్‌కే దత్తా ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఆవులను కౌగిలించుకొని ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చింది. ఆవులు దేశ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక అని, దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు గోవులు ప్రతీక అని పేర్కొంది. ఆవులను కౌగిలించుకోవడం ద్వారా శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించింది. పాశ్చాత్య సంస్కృతి వల్ల వేద మంత్రాలు వినపడకుండా పోతున్నాయని, కల్చర్‌ని కాపాడుకునేందుకు ఇలాంటివి జరుపుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలను గోప్రేమికులు స్వాగతించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఆవును ఆప్యాయంగా హత్తుకుంటే బీసీ, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని సమర్ధించేవారు చెప్పే మాట. అయితే కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గుర్‌గావ్‌లోని ఓ ఎన్జీవో సంస్థ గతేడాది ఈ ఆవు కౌగిలింత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ గోవులను హత్తుకోవడం, పక్కన కూర్చోవడం, స్పృశించడం వంటివి చేస్తుంటారు.