పిల్లలకు నైతిక విలువలు చెప్తూ విద్య బోధించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చోరీకి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి నుంచి రూ. లక్షన్నర చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని పట్టుకుని రిమాండుకు తరలించారు. సంగారెడ్డిలో జరిగిన ఈ చోరీ ఘటన గురించి డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి రాములు అనే వ్యక్తి ఈ నెల 10న బ్యాంకులో రూ. 1.50 లక్షలు డ్రాచేసి బైకుపై భార్యతో వెళ్తున్నాడు. మధ్యలో కూరగాయల కోసం ఆగగా, బ్యాంకు నుంచి వారినే అనుసరిస్తున్న ఓ వ్యక్తి నగదు సంచి లాక్కొని పరారయ్యాడు. రాములు జరిగిందంతా వివరించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది జోగిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే సార సంతోష్ గా గుర్తించి ఈ నెల 17న అరెస్ట్ చేశారు. విచారించగా, గతంలో ఓ మహిళా హెడ్మాస్టర్ ఫోన్‌కి అసభ్య సందేశాలు పంపి సస్పెండ్ అయిన విషయం వెలుగు చూసింది. దాంతో సస్పెండ్ అయిన సంతోష్.. కొద్ది రోజుల క్రితం తిరిగి డ్యూటీలో చేరాడు. అంతేకాక, చోరీలు చేశాక పట్టుబడకూడదని బైకు నెంబరును తిప్పి బిగించుకున్నట్టు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకొని కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించినట్టు పోలసులు వెల్లడించారు. కాగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మంచి జీతం తీసుకుంటూ చోరీల బాట పట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.