సినీ ఇండస్ట్రీకి కేంద్రం శుభవార్త.. షూటింగ్‌లకు త్వరలో మార్గదర్శకాలు - MicTv.in - Telugu News
mictv telugu

సినీ ఇండస్ట్రీకి కేంద్రం శుభవార్త.. షూటింగ్‌లకు త్వరలో మార్గదర్శకాలు

July 7, 2020

Movies Shootings

రాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినా కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు మూడు సీరియల్స్ నటీనటులకు కరోనా సోకింది. దీంతో సీరియల్ షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఇక సినిమా షూటింగ్‌లు కూడా కొన్ని మొదలైనా కరోనా భయం నెలకొంది. ఈ కక్రమంలో సినిమా పరిశ్రమకు త్వరలోనే కేంద్రప్రభుత్వం శుభవార్త  అందించనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మంగళవారం ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)2020’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా, టీవీ, గేమింగ్‌ వంటి  వివిధ విభాగాలకు వేర్వేరు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 

కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌లను తిరిగి ప్రారంభించడానికి కావాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని చెప్పారు. ‘టీవీ సీరియల్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, కో-ప్రొడక్షన్‌, యానిమేషన్‌, గేమింగ్‌తో సహా అన్ని ప్రొడక్షన్‌లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ముందుకు రాబోతుంది. దీని గురించి త్వరలో ప్రకటిస్తాం’ అని జవదేకర్ తెలిపారు. మరోవైపు సినిమా రంగంలో వ్యాపారవేత్తలు మరింత పెట్టుబడులు పెట్టి పరిశ్రమను ముందుకు తీసుకుపోవాలని అన్నారు. 80 మందికి పైగా విదేశీ చిత్ర నిర్మాతలు తమ సినిమాలను భారత్‌లో చిత్రీకరించేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ లభించిందని చెప్పారు. కాగా, మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమలో షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సడలింపులు ఇచ్చినా.. సినీ పరిశ్రమకు మాత్రం అందులో ఊరట లభించలేదు.