శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు (సోమవారం) తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముర్ము హైదరాబాద్కు చేరుకోనున్నారు. దీనికి ముందు… ఏపీలోని శ్రీశైలంలో పర్యటన ముగించుకొని హైదరాబాద్కు రానున్నారు. నేటి (December 26)నుంచి ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో విడిది చేయనున్నారు. రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆమె రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలవనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమెకు విందు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
అయితే రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు.. సీఎంలు కలవడమనేది సాధారణంగా జరిగేదే. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతిని కేసీఆర్ కలవనుండటం కొంత ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన పలు సందర్బాల్లో కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకడం గానీ, ఆయనతో భేటీ కావడం కానీ జరగలేదు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు రప్పించి గొప్పగా సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మళ్లీ ఈ రోజు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక సందర్భంలో ఆమెకు ఘనస్వాగతం పలుకనున్నారు కేసీఆర్. ఆయనతోపాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు హకీంపేట రానున్నారు. చాలా రోజుల తర్వాత ఒకే అధికారిక కార్యక్రమంలో వీరిద్దరూ(గవర్నర్, సీఎం) పాల్గొంటుడటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతికి ఘనస్వాగంత పలికేందుకు ఇప్పటికే అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. పర్యటన నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు.