తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సోమవారం భద్రచలంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, గవర్నరు ప్రొటోకాల్ ప్రకారమే వెళ్లినా, ఆమెకు స్వాగతం లభించలేదు. గతంలో మేడారంలో ఏం జరిగిందో, యాదాద్రిలో అదే జరిగింది. యాదాద్రిలో ఏం జరిగిందో, ఇప్పుడు భద్రాద్రిలోనూ అదే జరిగింది. జిల్లా కలెక్టర్ అనుదీప్, పోలీసు సూపరిండెంట్ సునీల్ దత్ ఆమెను రిసీవ్ చేసుకోవటానికి రాలేదు. అయినా, అవేమి పట్టించుకోకుండా గవర్నర్ తమిళిసై శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించి, సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.
గవర్నర్ వెంట భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య మాత్రమే ఉన్నారు. ఆమె పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్‌ను సమకూర్చకపోయిన ఆమె రైలు, రోడ్డు మార్గాల ద్వారా భద్రాచలం వెళ్లి, శ్రీరాముల పట్టాభిషేకంలో పాల్గొన్నారు. తొలుత అలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు అలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జైలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు. దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ఉన్న గుడికి వెళ్లిన గవర్నరుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.