TS : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై గవర్నర్ ఆరా...48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం.. - Telugu News - Mic tv
mictv telugu

TS : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై గవర్నర్ ఆరా…48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం..

March 15, 2023

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి రాజ్ భవన్ నుంచి లేఖ వెళ్లింది. దీనిపై 48గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్ కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని..అసలైన అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా పేపర్ లీక్ కేసుకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణను సిట్ కు బదిలీ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో జరగనుంది. కాగా పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు ప్రవీణ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించిన పోలీసులు, టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చే చాలామందితో ప్రవీణ్ సంబంధాలు పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు తన మొబైల్ లో పలువురు మహిళల కాంటాక్ట్స్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.