తెలంగాణ గవర్నర్ తమిళిసై విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి చికిత్స అందించారు. వారణాసికి వెళ్లిన గవర్నర్.. తిరుగు ప్రయాణంలో శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ – హైదరాబాద్ ఇండిగో విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ప్రయాణ సమయంలో విమానంలో ఓ వ్యక్తి ఛాతీభాగంలో నొప్పితో ఇబ్బందిపడ్డారు. గమనించిన విమాన సిబ్బంది విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? అని అడుగగా, అదే విమానంలో ఉన్న తమిళిసై స్పందించారు. అస్వస్థతకు గురైన వ్యక్తి వద్దకు వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు.
దాంతో కోలుకున్న వ్యక్తితో పాటు విమాన సిబ్బంది గవర్నర్‌కి ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని గవర్నర్ అభినందించారు. ప్రతీ విమానంలో ప్రాథమిక చికిత్స కోసం కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే విమాన ప్రయాణీకుల్లో ఎవరైనా డాక్టర్లు ఉంటే వారి వివరాలు విమాన సిబ్బంది వద్ద ఉండేలా ఓ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విమాన సిబ్బందితో పాటు సామాన్యులకు కూడా సీపీఆర్ మీద శిక్షణ తీసుకుంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని తమిళిసై అభిప్రాయపడ్డారు.