అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నలుగురు వ్యక్తులు.. గవర్నర్ వ్యవస్థను, గవర్నర్లను ఎలా అవమానిస్తారంటూ ప్రశ్నించారు తెలంగాణ గవర్నర్ తమిళి సై. ఖమ్మం వేదికగా సాగిన బీఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కేసీఆర్ గవర్నర్‌ని అవమానించారని అన్నారు. గురువారం… పిల్లలు పరీక్షల భయాన్ని జయించే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని గవర్నర్ రాజ్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె.. ప్రోటోకాల్ వివాదాన్ని ప్రస్తావించారు.
ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తెలంగాణలో ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని నిలదీశారు.ఇంతవరకు కూడా రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఇది ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏకపక్ష వైఖరి కనిపిస్తోందని తమిళిసై అన్నారు. తాను తన విధిని మాత్రమే నిర్వహిస్తున్నానని, ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని విబేధించడం లేదన్నారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నానని, ప్రోటోకాల్ తనకు తెలుసునని పేర్కొన్నారు. రాజకీయ నేతలు.. ప్రధానంగా ముఖ్యమంత్రులు గవర్నర్లను నిందిస్తున్నారంటే వారి ప్రభుత్వ వైఖరిని.. అదీ తెలంగాణలో ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థ పట్ల ఎక్కడా కూడా ప్రోటోకాల్ అనుసరించరని ఘాటుగా స్పందించారు. ప్రోటోకాల్ ఎందుకు అనుసరించరనే ఒక్కటే ప్రశ్న మళ్లీ మళ్లీ అడుగుతున్నానని… ఇందుకు వాళ్లు మొదట సమాధానం చెప్పాలన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానన్నారు