తెలంగాణలోని రాజ్ భవన్ లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఈకార్యక్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళ సై పాల్గొ్న్నారు. వేడుకల్లో భాగంగా పొంగలి వండారు. మంచి పొంగల్, ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్,G20 పొంగల్ అంటూ గవర్నర్ తమిళ సై ఆకాంక్షిచారు. హారతి ఇచ్చి హ్యాపీ పొంగల్ అంటూ రాజ్ భవన్ సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించానని తెలిపారు. అనంతరం మలక్ పేట్ ఘటన పై స్పందించారు. మలక్పేట ఆసుపత్రిలో సిజేరియన్ సర్జరీ చేయించుకున్న ఇద్దరు మహిళలు మరణించడం బాధాకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవాలు, సిజేరియన్ సేవలు ఓ ఆసుపత్రిలో ప్రాథమికం అన్న తమిళిసై… ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిని సందర్శించాలని తాను అనుకున్నానని, అయితే పండుగ కారణంగా వెళ్లడం లేదని చెప్పారు.
“గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగంలో మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు, కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన వద్ద నెలల తరబడి పెండింగ్లో ఉంచుకుంటున్నారని అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంతో వాటిపై కూడా గవర్నర్ స్పందించారు. “బిల్లులు పెండింగ్ కాదు, పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. ఈ తరహా విధానాల విషయంలో గతంలోనూ న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.” అని అన్నారు.
ప్రధాని ప్రారంభించిన రైల్వేస్ మాకు ఆనందంగా ఉందని తెలిపారు. వోకల్ For లోకల్ అని ప్రస్తావించారు. మంచి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రారంభిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలును ఇవాళ ప్రధాని ప్రారంభించడం సంతోషకరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అందరూ టీవీలు చూస్తోంటే ప్రధాని మన్ కీ బాత్ ద్వారా రేడియోకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పారు. అదే తరహాలో విమానాలు కాకుండా రైళ్లపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారని తమిళిసై వెల్లడించారు.