Governor Tamilisai made sensational comments against the TRS government.
mictv telugu

ఈ మూడేళ్లలో ఎన్నో అవమానాలు.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

September 8, 2022

తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్నారు. వరంగల్ పర్యటనలో తనను అవమానించారన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ అడిగితే చివరి వరకు సమాధానం చెప్పలేదని.. చివరికి 8 గంటలు కారులో ప్రయాణించి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని, రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు.

రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచినట్లు తమిళ సై పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని.. ప్రోటోకాల్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కుతుందన్నారు. తనకు గౌరవం ఇవ్వకున్నా తాను పని చేస్తూనే ఉంటానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేదేలేదని స్పష్టంచేశారు. రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నట్లు తమిళసై సౌందర్ రాజన్ తెలిపారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేసామని చెప్పారు. వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గవర్నర్ ఆఫీస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తోందని తమిళసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళ ను అవమానించారన్న చరిత్ర తెలంగాణ చరిత్రలో ఉండకూదనేది తన భావన అని పేర్కొన్నారు.