కేసీఆర్ ఈ పని చేస్తే బాగుంటుంది : గవర్నర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఈ పని చేస్తే బాగుంటుంది : గవర్నర్

May 16, 2022

ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై – తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన సంఘటనలు మనకు తెలిసిందే. ప్రోటోకాల్ ఇవ్వట్లేదని గవర్నర్, బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం గురించి గవర్నర్ ఓ మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. ఆ మాటల సారాంశం ఇది ‘నాకు నేనుగా గొడవలు క్రియేట్ చేయలేదు.

ప్రభుత్వమే ప్రొటోకాల్ ప్రకారం నాకు మర్యాద ఇవ్వలేదు. ఈ ప్రభుత్వానికి ఈ చర్య మాయని మచ్చగా మిగిలిపోతుంది. గతంలో ఏమైనా సమస్యలుంటే సీఎంతో మాట్లాడేదాన్ని, కానీ, గత కొంతకాలంగా ఫోన్లు చేస్తున్నా ఆయన లైన్లోకి రావడం లేదు. అపోహలు తొలగిపోవాలంటే కేసీఆర్ నాతో స్వయంగా కూర్చుని మాట్లాడాలి. ఈ క్రమంలో టీఆర్ఎస్ మంత్రులు నాపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఓ మహిళతో ఇలా వ్యవహరించవచ్చా? ఇదేనా తెలంగాణ సంస్కృతి? నాతో మాట్లాడిన అంశాలు కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడం నాకు విచిత్రంగా అనిపించింది.

ప్రభుత్వం కూలిపోతుందని నేను చెప్పలేదు. కేంద్రానికి కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, ఇక్కడి పరిస్థితులపై రిపోర్టు ఇచ్చాను. కేసీఆర్‌తో ఫైట్ చేయాలని మోదీ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అది నిజం కాదు. పనితీరుతోనే సమాధానమివ్వాలని ఆయన చెప్పారు. ఆయనంటే నాకు అభిమానం ఉంది. నేను ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ మనిషిని. అయినా నిర్మాణాత్మకంగా ఆలోచిస్తాను. గవర్నర్ స్థానాన్ని అవమానిస్తే సహించను. నేనేమీ నా వ్యక్తిగత పర్యటనకు ప్రోటోకాల్ అడగట్లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం గాడి తప్పింది. ఏదేమైనా స్నేహ హస్తం అందించడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రజల కోసం అందరి భాగస్వామ్యంతో ముందుకు నడుస్తాను’ అని తన అభిప్రాయాలను వెల్లడించారు.