బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో విపక్ష ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్లను అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. ‘కేసీఆర్ సహా సభకు హాజరైన మిగతా ముఖ్యమంత్రులు గవర్నర్ల వ్యవస్థ గురించి అవహేళనగా మాట్లాడారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడను. ప్రోటోకాల్‌పై కేసీఆర్ స్పందించాలి. ఎందుకంత చిన్నచూపు చూస్తున్నారో సమాధానం చెప్పాలి. దీనిపై స్పందించాకే ప్రభుత్వ ప్రశ్నలకు జవాబు చెప్తాను. 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నాకు ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసు. నా డ్యూటీ నేను చేస్తున్నా. నా దగ్గర ఎలాంటి సమస్య లేదు. గవర్నర్‌కి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నాపై ఎవరి ఒత్తిడి లేదు. స్వతంత్రంగా పని చేస్తున్నా. రిపబ్లిక్ డేపై నాకెలాంటి సమాచారం లేదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, గురువారం ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని రాజ్ భవన్లో ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ పైవిధంగా మాట్లాడారు.