“కొందరికి ఫామ్‌హౌస్‌లు ఉండడం కాదు.. అందరికీ ఫామ్‌లు(పొలాలు) ఉండాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్రంలోని పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలుండాలి. ప్రస్తుతం తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విసిగిపోయా. కానీ తెలంగాణ ప్రజలంలటే నాకేంతో ఇష్టం. వారు నా మీద ఉమ్మేసినా తుడుచుకుని వెళ్లిపోతా.” 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసంగంలోని మాటలవి. రాష్ట్ర ప్రభుత్వం , సీఎం కేసీఆర్ లను టార్గెట్ గా చేసుకొని.. ఓ రాజకీయ నేతగా గవర్నర్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై రాజ్యాంగ నిపుణులంతా నోరెళ్లబెడుతున్నారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో ఇదంతా ఏంటని తెలంగాణ ప్రజలు, మేధావులు, విశ్లేషకులు సైతం మండిపడుతున్నారని ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో శుక్రవారం ఓ కథనం ప్రచురితమైంది.
సీఎంని మరచి ప్రధానిపై ప్రశంసలు
ఆ కథనం ప్రకారం… గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మరిచి, తెలంగాణ ప్రభుత్వంపై, ప్రగతిపై అడుగడుగునా విద్వేషం వెళ్లగక్కారు. రాష్ట్రాభివృద్ధికై పాటుపడుతున్న సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించని గవర్నర్.. రాష్ట్ర పుట్టుకను అవమానించి, మొదటి నుంచీ తీరని ద్రోహం చేస్తున్న మోదీని మాత్రం పొగిడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్మిస్తున్న కొత్త సచివాలయంపై అక్కసు వెళ్లగక్కారు. ఈ రాష్ట్రానికి రోడ్లు, రైళ్లు ఇచ్చారంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఆమెకు ఇక్కడ సీఎం నాయకత్వంలో అమలవుతున్న ప్రజాసంక్షేమ పథకాలు కనిపించడలేదా అంటూ … విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆ పదవికే కళంకం తెచ్చారంటూ మండిపడుతున్నారు.
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు.?
ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలన్నీ ప్రజల కోసమేనని చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆమె ఉంటున్న రాజ్‌భవన్ కూడా ఎవరో ఒకరు నిర్మించకపోతే.. ఎక్కడ ఉండేవారని ప్రశ్నిస్తున్నారు. కొత్త గ్రామాల్లో, మండలాల్లో శాశ్వత పంచాయతీ భవనాలు, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం, జిల్లాకో మెడికల్ కాలేజీ, మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కోసం కొత్త భవనాలు, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇవన్నీ జాతి నిర్మాణంలో భాగం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రధాని మోదీ ఢిల్లీలో సెంట్రల్ విస్టా పేరుతో దాదాపు రూ.17వేల కోట్ల ఖర్చుతో ఈ నిర్మాణాలు చేపట్టారు. ప్రధాని నివాసానికే రూ.400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.. మరి దీనిపై ఏమంటారునిస్తారా? అని గవర్నర్‌ను నిలదీస్తున్నారు.
ఏం? మేం విదేశాల్లో చదవకూడదా?
“మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్రంలోని పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలుండాలి” అని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం అందించే సాయంపైనా విషం కక్కటం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఇక ‘రాష్ట్రంలో కొంతమందికి ఫామ్‌హౌస్‌లు ఉండటం కాదు.. వ్యవసాయ క్షేత్రాలు బాగుండాలి..’ వ్యాఖ్యల గురించి అయితే ఏమనాలో తెలియని పరిస్థితి. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు.. ఇవి మాత్రమే కాకుండా పంటకొనుగోళ్లు.. ఇవన్నీ ఎవరు చేశారు అని తెలంగాణ రైతాంగమే అడుగుతోంది. ‘రాష్ట్రంలో రోజుకు 22మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి..’ అని అన్నారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం చూస్తే 2021లో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో బీజేపీ పాలిత మహారాష్ట్ర 13.5 శాతంతో అగ్రస్థానంలో, మధ్యప్రదేశ్ 9.1 శాతంతో మూడో స్థానంలో, కర్ణాటక 8 శాతంతో ఐదో స్థానంలో ఉంది. వీటి గురించి ఎందుకు మాట్లేడలేదని అంటున్నారు.
ఈ సంగతి తెలియదా?
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి గానీ, పథకాల అమలు గురించి గానీ, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం గురించి గానీ గవర్నర్ తన ప్రసంగంలో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కానీ జాతీయ రహదారులకు నిధులు ఇస్తున్నారంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి, ప్రధానిని పొగడటాన్ని బట్టి కేవలం బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే, ఫక్తు రాజకీయ నాయకురాలిగా ఆమె మాట్లాడిందని స్పష్టంచేస్తున్నారు. తెలంగాణ పుట్టుకనే మోదీ అవమానించిన విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
అక్కడో మాట.. ఇక్కడో మాట
తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లినా తెలంగాణపై విమర్శలు కొనసాగించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. తెలంగాణలో చట్టం, న్యాయ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. వేరే రాష్ర్టానికి వెళ్లి తెలంగాణను అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి జనాలు. అయితే అక్కడ చేసిన ప్రసంగంలో మాత్రం పూర్తిగా ఆ రాష్ట్ర ప్రగతి గురించే మాట్లాడటం గమనార్హం. తెలంగాణలో ఒక విధంగా, పుదుచ్చేరిలో మరోవిధంగా మాట్లాడటం ఏమిటని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.