హైదరాబాద్ రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. వేడుకల్లో సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్భవన్లో జరిగిన పేరేడ్లో బలగాలు పాల్గొన్నాయి. సికింద్రాబాద్ సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ సహ ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందుకు కూడా సీఎం దూరంగా ఉంటారని తెలిసింది. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ఆయన విముఖంగా ఉన్నట్లు సమాచారం.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. గురువారం ఉదయం ఆయన ప్రగతిభవన్లో జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అంతకు ముందు ఆయన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమర జవానుల స్మారక స్తూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించనున్నారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్ధిల్లుతున్న భారతదేశంలో సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సాధారణంగా రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్ సమక్షంలో జరుగుతాయి.గతంలో రిపబ్లిక్ డే వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేది.ఈ వేడుకలో ముఖ్యమంత్రి, గవర్నర్ పాల్గొనేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు మధ్య ఏర్పడిన విభేదాలే ప్రధాన కారణం.ప్రోటోకాల్ వివాదంతో ఒకే వేదికను పంచుకోని సీఎం కేసీఆర్, గవర్నర్ లు రిపబ్లిక్ డే వేడుకలు కలిసి నిర్వహించుకోలేని పరిస్థితి ఇది. దీంతో రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుగనున్నాయి.