పూలే దంపతులపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

పూలే దంపతులపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

March 3, 2022

08

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయ్ ఫూలేపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలు తీవ్రమైన విమర్శలకు దారితీశాయి.

ఇటీవలే ఓ కార్యక్రమానికి హాజరైన కోషియారీ.. ”పదేళ్ళ వయసున్న సావిత్రి బాయ్‌ని, జ్యోతిబా ఫూలే 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ఆ చిన్న తనంలో వారు ఏం చేయగలరు. పెళ్లి జరుగుతున్నపుడు వారు ఏం ఆలోచించగలరు” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. కోషియారీని తక్షణమే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ విషయంపై పలువురు స్పందిస్తూ.. ”ఆ రోజుల్లో బాల్యంలోనే పెళ్లి చేసుకోవడం ఆచారం. ఇటువంటి అసహ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం కోసం ఫూలేనే ఎందుకు ఎంచుకున్నారు” అని ప్రశ్నిస్తున్నారు.

మరోపక్క భగత్ సింగ్ కొద్ది రోజుల క్రితం ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సమర్థ రామదాసు గురువు అని చెప్పారు. ఈ గడ్డపైన అనేక మంది మహారాజులు, చక్రవర్తులు జన్మించారన్నారు. చాణక్యుడు లేకపోతే చంద్రగుప్త మౌర్య గురించి ఎవరు అడుగుతారన్నారు. సమర్థ రామదాసు లేకపోతే ఛత్రపతి శివాజీ గురించి ఎవరు అడుగుతారు అని కోషియారీ అన్నారు.