కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాక నగరాల పేర్ల మార్పుపై ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ దేశంలో చాలా చోట్ల నగరాలు, పట్టణాలు, రైల్వే స్టేషన్ల పేర్లు మార్చేశారు. అయినా ఇంకా చాలా వాటి పేర్లు మార్చి పాతవి లేదా కొత్తవి పెట్టాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్లను మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ని ధరాశివ్‌గా పేరు మారుస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన లేఖలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పేర్ల మార్పుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల హామీలో ఈ నగరాల పేర్లు మార్పు ఒకటి. దీన్ని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలడానికి కొద్ది రోజుల ముందు ఉద్ధవ్ థాక్రే కేబినెట్ నగరాల పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం నుంచి అప్రూవల్ రావడంతో ఏక్ నాథ్ షిండే వర్గం సంతోషంలో మునిగిపోయింది.