యూట్యూబ్ క్రియేటర్స్‌కి ప్రస్తుతం కొదవ లేదు. జీ-మెయిల్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు ఓ ఛానెల్ స్టార్ట్ చేసి తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు.చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు..సామన్య రైతు నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు యూట్యూబ్ ఛానెల్ ద్వారా లోకానికి పరిచయమైపోతున్నారు. అందులోనూ యూట్యూబ్ ద్వారా వేలు, లక్షలు, కోట్లల్లో కూడా సంపాదన ఉండడతో దానినే పలువురు వృత్తిగా ఎంచుకుంటే మరికొందరు ఖాళీ సమయాల్లో వీడియోలు చేస్తున్నారు. వంటలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ చిట్కాల వంటి వీడియాలను అప్లోడ్ చేస్తు కాస్త డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు వీటికి మినహాయింపు కాదు. తమకు నచ్చిన కంటెంట్‌తో యూజర్స్‌ను అలరిస్తున్నారు. అదనపు సంపాదన కోసం యూట్యూబ్ ద్వారా అడగులు వేస్తున్నారు. కొందరు అధికారులు ఐతే ఆఫీస్ సమయాల్లో కూడా యూట్యూబ్ పై దృష్టిసారిస్తున్నారు. అయితే కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నడుపుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ విధులు నిర్వర్తించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానెల్ నడపరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిని సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్రహోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఈనెల 3న విడుదల చేశారు. ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారనే కారణంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.