భూ లకటక..ఇక బకాసురుల పని అంతే..! - MicTv.in - Telugu News
mictv telugu

భూ లకటక..ఇక బకాసురుల పని అంతే..!

July 19, 2017

గజం సర్కార్ భూమిని కూడా కబ్జా కాన్విమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూముల్ని గుర్తించే పనిలో పడింది.ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రెవెన్యూ శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. మేడ్చల్ జిల్లాలో 12 శాతం భూములు అక్రమార్కుల చేతిలో ఉండటంపై సీరియస్ గా నజర్ పెట్టింది. అసలు ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణకు గురవుతుంటే ఇన్నాళ్లు అధికారులు ఏం చేశారు…?

మియాపూర్ భూ వివాదంతో తెలంగాణ రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే దిశగా పయనిస్తోంది. వీటిని గుర్తించి కబ్జాదారులకు నోటీసులు ఇస్తోంది. మండలాల వారీగా రెవన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నారు.

మేడ్చల్ జిల్లాలో 7,925 ఎకరాల ప్రభుత్వ భుములు ఆక్రమణ అయ్యాయి. ఇక్కడ గజం భూమి విలువ కనీసం రూ.25 వేల వరకు పలుకుతుంది. అందుకే అక్రమార్కుల కన్ను ఇక్కడి సర్కారీ భూములపై పడింది. 7925.12 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కినట్టు జిల్లా రెవె న్యూ అధికారులు తేల్చారు. వాటిని గుర్తించి రక్షించేందుకు కసరత్తు చేస్తున్నారు.

దాదాపు 12 శాతం భూముల కబ్జాపై అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టారు. ప్రభుత్వం జీవో-59లో భాగంగా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తే వందల ఎకరాలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే రావడంతో గుస్సా అవుతున్నారు. ఇందులోనూ సగం మందికిపైగా అనర్హులే ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌ను జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్వహిస్తున్నారు. ఇలా గుర్తించిన కబ్జాదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు వారి ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిపైనా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో నుంచి 10,397.33 ఎకరాలను గతంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు ఇతరులకు అసైన్ చేశారు. ఈ భూములు పొందినవారిలో చాలా మంది దుర్వియోగం చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అసైన్డ్ భూములు పొంది వాటిని విక్రయించినవారిని, ఒక అవసరం కొరకు భూమిని పొంది వేరే పనులకు వినియోగించిన వారి లిస్టును రెడీ చేశారు. వారికి నోటీసులు జారీ చేసేపనిలో నిమగ్నమయ్యా రు. ఇప్పటివరకు దాదాపు మూడు వేల మంది కి నోటీసులు జారీ చేశారు.