Govt monetised enemy properties worth Rs 3,400 crore
mictv telugu

శత్రువుల ఆస్తులతో కేంద్రానికి రూ.3400 కోట్లు

February 21, 2023

Govt monetised enemy properties worth Rs 3,400 crore

మనదేశంలో భారత పౌరసత్వం కలిగిన వారి ఆస్తులతోపాటు, శత్రువుల ఆస్తులు(enemy properties) కూడా ఉన్నట్లు మీకు తెలుసా?. అలాంటి శత్రువుల ఆస్తులను అమ్మడం ద్వారా కేంద్రం ప్రభుత్వం రూ.3,400 కోట్లు సంపాదించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Home Ministry) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ఆస్తుల్లో ఎక్కువభాగం షేర్లు(Shares), బంగారం(Gold), రెవెన్యూ రిసీట్ల వంటి చరాస్తుల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది.

కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్‌ ఇండియా (CEPI)… విడుదల చేసిన లెక్కల ప్రకారం.. మొత్తం రూ.3,407.98 కోట్లలో.. 152 కంపెనీలకు చెందిన 7.53కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.2,708.9 కోట్లు. ఇక, మరో రూ.699.08 కోట్లు రెవెన్యూ రిసీట్ల రూపంలో ఉన్నాయని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. వీటితో పాటు గవర్నమెంట్‌ ఆఫ్ ఇండియా మింట్‌ ద్వారా 2021 జనవరిలో 1699.79గ్రాముల బంగారాన్ని (Gold) విక్రయించి రూ.49.14లక్షలు, 28.89కిలోల వెండి ఆభరణాలను విక్రయించి రూ.10.92లక్షలకు ఆర్జించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు శత్రువులకు చెందిన ఎలాంటి స్థిరాస్తులను ప్రభుత్వం సొమ్ము చేసుకోలేదని తెలిపారు.

ఎనిమీ ప్రాపర్టీగా చెప్పబడుతున్న ఈ ఆస్తులు… అప్పటివరకూ మనదేశంలోనే ఉండి, వేరే దేశాల పౌరసత్వం కోసం ఇక్కడున్న ఆస్తులను వదిలేసినవారివిగా చెప్పబడుతున్నాయి. పూర్తి విషయానికొస్తే… భారత్‌- పాక్‌ విభజన, 1962, 1965 యుద్ధాల తర్వాత భారతీయులు ఎవరైనా పాకిస్థాన్‌, చైనా వెళ్లేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. అయితే ఆ దేశాల పౌరసత్వం తీసుకున్నవారి స్థిరచరాస్తులు కేంద్రానికి చెందుతాయని అప్పట్లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. అలా వారు వదిలివెళ్లిన ఆస్తులనే ఎనిమీ ప్రాపర్టీ అంటారు. ఆ ఆస్తులు, భూముల నిర్వహణ బాధ్యతను సెపికి అప్పగించింది.

మనదేశంలో అలాంటి శత్రు ఆస్తులు 12,611 ఉన్నాయి. ఇందులో 12,386 ఆస్తులు పాక్‌ పౌరసత్వం తీసుకున్నవారివి కాగా.. మిగతా 126 చైనా జాతీయులవి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 6,255 ఎనిమీ ప్రాపర్టీలను గుర్తించగా..అతి తక్కువగా హరియాణాలో 71 శత్రు ఆస్తులున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో 4,088, దిల్లీలో 659, గోవాలో 295, మహారాష్ట్రలో 208, తెలంగాణలో 158, గుజరాత్‌లో 151, త్రిపురలో 105, బిహార్‌లో 84, మధ్యప్రదేశ్‌లో 94, ఛత్తీస్‌గఢ్‌లో 78 శత్రు ఆస్తులున్నాయి.