వాహనాల ఇన్స్యూరెన్స్ బాదుడే బాదుడు.. పెంపు ఇలా... - MicTv.in - Telugu News
mictv telugu

వాహనాల ఇన్స్యూరెన్స్ బాదుడే బాదుడు.. పెంపు ఇలా…

May 26, 2022

వాహనదారులకు అలర్ట్. జూన్ 1 నుంచి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగబోతోంది. అన్ని కేటగిరీలకు ఇది వర్తిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రీమియం చార్జీలను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ప్రీమియం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు బుధవారం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీతో సంప్రదింపులు జరిపి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇలా ప్రీమియం వివరాలను వెల్లడించడం ఇదే మొదటిసారి. ఇక వచ్చే నెల నుంచి వాహనదారులకు కార్లు, టూ వీలర్ల ఇన్సూరెన్స్ మరింత భారం కానుంది.

కరోనా వైరస్ మహమ్మారి కన్నా ముందు నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదు. రెండేళ్ల తర్వాత థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను ప్రభుత్వం పెంచింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా దీనిపై మారిటోరియం విధించారు.

 

తాజా నోటిఫికేషన్ ప్రకారం.. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం ధరలు ఇలా ఉండనున్నాయి.

• 1,000 సీసీ ఇంజిన్ కెపాసిటీ లోపు ప్రైవేట్ కార్ల ఇన్సూరెన్స్ రూ.2,072 నుంచి రూ.2,094 కు పెరగనుంది.
• 1,000 సీసీ నుంచి 1,500 సీసీ మధ్య ఇంజిన్ కెపాసిటీ ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రీమియం రూ.3,221 నుంచి రూ.3,416 కి పెరిగింది. అయితే 1,500 సీసీ దాటిన కార్ల ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890 కి తగ్గడం విశేషం.
• టూవీలర్ల విషయానికి వస్తే 75 సీసీ లోపు టూవీలర్లకు రూ.538 ప్రీమియం, 75 సీసీ నుంచి 150 సీసీ టూవీలర్లకు రూ.714 ప్రీమియం, 150 సీసీ నుంచి 350 సీసీ టూవీలర్లకు రూ.1,366 ప్రీమియం, 350 సీసీ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉన్న టూవీలర్లకు రూ.2,804 ప్రీమియం చెల్లించాలి. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఇన్సూరెన్స్ ప్రీమియంపై 7.5 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
• ఇక ఎలక్ట్రిక్ కార్ల విషయానికొస్తే 30కిలోవాట్ల కంటే తక్కువ క్‌ కార్ల ప్రీమియం రూ.1,780, 30 నుంచి 65 కిలోవాట్ల మధ్య ఉండే కార్లకు రూ.2,904గా నిర్ణయించారు.
• 12000 కేజీల నుంచి 20వేల కేజీల సామర్థ్యం కమర్షియల్‌ వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను రూ.33,414 నుంచి రూ.35,313కు పెంచారు. 40వేల కేజీల కంటే ఎక్కువ సామర్థ్యమున్న వాహనాలకు బీమా రూ.41,561 నుంచి రూ.44,242కు పెరిగింది.
• విద్యాసంస్థల బస్సులకు ఇన్స్యూరెన్స్ ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వింటేజ్ కార్లుగా రిజిస్టర్ అయిన ప్రైవేట్ కార్లకు 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.