దళారులకు మంత్రి వార్నింగ్.. ఉల్లిని నిల్వచేశారో..  - MicTv.in - Telugu News
mictv telugu

దళారులకు మంత్రి వార్నింగ్.. ఉల్లిని నిల్వచేశారో.. 

September 24, 2019

కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ ఎక్కువగా పండే ఉల్లి పంట బాగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనివల్ల ఉత్పత్తి బాగా పడిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే అదనుగా భావించిన దళారులు ఉల్లిని పెద్ద ఎత్తున గోదాముల్లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌  హెచ్చరించారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో జనాలు ఉల్లిఘాటుకు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ ఉల్లి ధరలపై మంత్రి స్పందిస్తూ.. ఉల్లి ధరలు అదుపులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఉల్లి సరఫరా చేయాలని రాష్ట్రాలు కూడా తమను కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద 50 వేల టన్నుల ఉల్లి నిల్వలు ఉన్నాయని.. ధరల ప్రభావిత రాష్ట్రాలకు పంపిణీ చేయిస్తున్నాం అని వెల్లడించారు. 

ఇప్పటికే 15 వేల టన్నులను వేర్వేరు ప్రాంతాలకు పంపామని.. ఇంకా 35 వేల టన్నుల నిల్వ ఉందని అన్నారు. జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (ఎన్‌ఏఎఫ్‌ఈడీ), జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌)ల ద్వారా పంపకాలు చేయిస్తాం అని చెప్పారు. మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యం కూడా లేదని తెలిపారు. ఉల్లి డిమాండ్‌ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు నిర్దేశిత నామ మాత్రపు ధర చెల్లించి కేంద్రం వద్ద కొనుగోలు చేయవచ్చు అని వివరించారు. ఇదిలావుండగా మరికొద్ది రోజుల్లో ఉల్లి ధరలు దిగివస్తాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వ్యాఖ్యానించారు. ఉల్లి ఎగుమతులపై కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ బ్లాక్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.70 నుంచి రూ.80కు విక్రయిస్తున్నారు.