ఒక ప్రభుత్వ టీచర్ 25 స్కూళ్లలో పని చేస్తోంది.. ఏడాదికి కోటి! - MicTv.in - Telugu News
mictv telugu

ఒక ప్రభుత్వ టీచర్ 25 స్కూళ్లలో పని చేస్తోంది.. ఏడాదికి కోటి!

June 5, 2020

Govt Teacher Earn 1 Crore in 25 Schools

తన అతి తెలివితో ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించింది ఓ గవర్నమెంట్ టీచర్. ఏకంగా 25 స్కూళ్లలో పని చేస్తూ.. సంవత్సరానికి కోటి రూపాయల జీతం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్ ఘనకార్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యాశాఖ అధికారులు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఒకే టీచర్ ఏడాది కాలంగా ఇలా జీతం తీసుకుంటున్నా కూడా ఎందుకు గుర్తించలేకపోయారనేది చర్చనీయాంశంగా మారింది. 

యూపీలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అనామికా శుక్లా అనే టీచర్ పనిచేస్తోంది. అమేథీ, అంబేద్కర్ నగర, రాయ్ బరేలీ, ప్రయాగరాజ్, అలిగఢ్ సహా పలు జిల్లాల్లోని మొత్తం 25 స్కూళ్లలో కూడా ఆమె పని చేస్తున్నట్టుగా రికార్డు చేయించుకుంది. ప్రతి నెల ఆమెకు అన్ని చోట్ల నుంచి ప్రభుత్వం ద్వారా జీతం వచ్చి పడింది. ఇలా 13 నెలల పాటు జీతం తీసుకుంది. ఇటీవల విద్యాశాఖ అధికారులు కొన్ని సంస్కరణల కోసం విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిని లెక్కించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఈ టీచర్ బాగోతం బయటకు వచ్చింది. 

ప్రతి స్కూలులో పని చేసే టీచర్లు తమ ఆధార్ నంబర్లను సమర్పించారు. వీటిని పరిశీలిస్తుండగా అనామికా శుక్లాకు చెందిన ఆధార్ నంబర్ 25 చోట్ల కనిపించింది. దీనిపై ఆరా తీయగా.. ఆమె ఒక్కరే అని తేలింది. ప్రతి నెల ఒకే అకౌంట్ నంబర్ నుంచి అన్ని స్కూళ్ల నుంచి జీతం కూడా తీసుకుంటుందని వెల్లడైంది. దీంతో ఇంత కాలం ఈ విషయం ఎందుకు వెలుగులోకి రాలేదనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన వారంతా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత పెద్ద మోసం జరుగుతున్నా కూడా ఎలా గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు.