కశ్మీర్ రైతులకు కేంద్రం శుభవార్త.. మేమే కొంటాం
కశ్మీర్‌లో యాపిల్ పండ్లు పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) స్కీమ్ కింద నేరుగా రైతుల నుంచే యాపిల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో కశ్మీరీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అమలు చేస్తున్న పౌర, రవాణా ఆంక్షలతో అక్కడ యాపిల్ కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో యాపిల్ రైతులు ఆందోళనకు గురయ్యారు. వారి ఆదాయం దెబ్బతిని భారీ నష్టాలను సైతం చవిచూస్తున్నారు. కేంద్రం ఈ దిశగా ఆలోచించింది. రైతులు, వ్యాపారుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చర్యతో యాపిల్ రైతుల ఆదాయం పెరుగడమే కాకుండా, డెరెక్ట్ ట్రాన్స్‌ఫర్ సబ్సిడీలను నేరుగా ఆయా రైతుల అకౌంట్లలో వేయడం జరుగుతుంది.
యాపిల్ రైతులు హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో హోంశాఖ స్పందించింది. ఏ, బీ, సీ క్యాటగిరి కింద యాపిల్స్‌ను వాటిని పండించే జిల్లాల నుంచి, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) నేతృత్వంలో యాపిల్స్ సేకరణ ప్రయత్నాలు ప్రారంభమై, గుర్తింపు పొందిన రాష్ట్ర ఏజెన్సీల ద్వారా మొత్తం ప్రక్రియ డిసెంబర్ 15 కల్లా పూర్తవుతుందని హోం మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర హోం శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వమే నేరుగా యాపిల్స్ సేకరించడం ద్వారా ప్రభుత్వ , సివిల్ కర్వ్యూతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ఉపకరిస్తుందని హోం శాఖ భావిస్తోంది.
'రైతుల నుంచి నేరుగా యాపిల్స్‌ను పండ్ల మార్కెట్లలో సేకరిస్తాం. యాపిల్స్ సేకరణ కోసం ప్రత్యేక మార్కెట్ ఇన్టర్‌వెన్షన్ ప్రైస్ స్కీమ్ అమలు చేస్తాం. 12 లక్షల మెట్రిక్ టన్నుల యాపిల్స్‌ను సేకరిస్తాం' అని సమాచార, ప్రచార శాఖ డైరెక్టరేట్ కూడా ఓ ట్వీట్‌లో తెలిపింది. దీంతో యాపిల్ రైతులు తమ కష్టాలు తీరినట్టే అంటున్నారు.