Govt to demolish Srikaryam bus stand in Thiruvananthapuram
mictv telugu

అబ్బాయిల ఒడిలో అమ్మాయిల బస్టాండ్.. నేలమట్టం

September 17, 2022

అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ స్థానికులు బస్టాండులోని కుర్చీలను కూల్చివేసిన ఘటన రెండు నెలల క్రితం కేరళలో జరిగింది. దీంతో మండిపోయిన విద్యార్థులు ఈ సారి పక్కపక్కనే కాదు, అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చుంటారంటూ చెప్పినట్టే చేసి సంచలనం రేపారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారగా, తాజాగా వివాదానికి కారణమైన బస్టాండును కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.

వివరాల్లోకెళితే.. తిరువనంతపురం శ్రీకార్యం బస్టాండ్ బెంచ్‌లో వయసొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ స్థానికులు అక్కడి బెంచీలను ధ్వంసం చేశారు. ఇది నచ్చని ఇంజనీరింగ్ విద్యార్ధులు మిగిలిపోయిన బెంచీలపై అమ్మాయిలను ఒళ్లో కూర్చోబెట్టుకుని నిరసన తెలిపారు. బస్టాండును పోలీసులు సీజ్ చేయగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం ప్రభుత్వం దాకా వెళ్లింది. దీంతో ఆ బస్టాండును కూల్చివేయాలని నిర్ణయించారు. దీనిపై నగర మేయర్ ఆర్య రాజేంద్రన్ మాట్లాడుతూ.. కేరళ ప్రోగ్రెసివ్ స్టేట్ అని, కాలం చెల్లిన నిబంధనలకు తావు లేదన్నారు. కూల్చివేసిన స్థానంలోనే కొత్త బస్టాండును నిర్మిస్తామని, అందులో ఎలాంటి లింగ వివక్షకు తావు లేకుండా కుర్చీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వయసొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో ఎలాంటి నిబంధన లేదని స్పష్టం చేశారు. అలా కనిపిస్తే వేధించే సంస్కృతి ఏనాడో అంతరించిపోయిందని అభిప్రాయపడ్డారు.